కర్నూలు, 2026-06-05
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ ను తక్షణమే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ ను తక్షణమే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో, తల్లిదండ్రుల ఆశలతో వ్యాపారం చేస్తున్న కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాసుగారి నాగార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను అక్రమంగా తరలించి, పాఠశాల రికార్డుల్లో తప్పుడు హాజరు చూపిస్తూ, నకిలీ టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టిస్తూ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల డేటాను, పాఠశాలల హాజరు రిజిస్టర్లను, కోచింగ్ సెంటర్ రికార్డులను క్షుణ్ణంగా సరిపోల్చి విచారణ చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఖాజా బాషా సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ, అడ్మిషన్లు, భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపి, సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఆ సెంటర్ హాస్టల్ లో నాణ్యతలేని ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయని, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార నమూనాల పరీక్షా ఫలితాలను బహిర్గతం చేయాలని కోరారు.
కావున సంబంధిత అధికారులు స్పందించి, ఎమ్మిగనూరు విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ పై సమగ్ర విచారణ జరిపి, సీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అంజి, ఏఐఎస్ఎ నాయకులు అశోక్, వర్ధన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.










