ఆదోని పట్టణంలోని ఎస్సీ నంబర్1 హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందడం లేదని, సరుకులు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆదివారం ఆర్డీవో కార్యాలయం ముందు ఖాళీ ప్లేట్లతో మెరుపు ధర్నా నిర్వహించారు. వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు. మాకు అన్నం పెట్టలేని వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన నాణ్యమైన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని, అనేక సందర్భాల్లో భోజనం కూడా అందక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందాల్సిన గుడ్లు, ఇతర సరుకులను బయటకు తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపై అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు పట్టించుకోకపోవడంతోనే ఖాళీ ప్లేట్లతో నిరసనకు దిగాల్సి వచ్చిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యార్థులకు అన్నం కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వార్డెన్‌పై వెంటనే విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందాల్సిన గుడ్లు, బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, అవసరమైన వసతులు కల్పించాలని కోరారు. హాస్టల్ నిర్వహణపై ఉన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి మోహన్, వెంకటేశులు, ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, ఉత్తేజ్, మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.










