దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వివరాలను ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ (ఏఈబీఏఎస్)లో నమోదు, సరిచేయడానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ఇచ్చిన గడువుకు అదనంగా మూడు వారాల సమయం పొడిగించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించి, గడువులోపు పూర్తి చేయాలని కళాశాలల డీన్లు, ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీతో పాటు జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, డెమోన్స్ట్రేటర్ల ప్రొఫైల్ వివరాల్లో జాతీయ వైద్య రిజిస్టర్ (ఎన్ఎంఆర్) లేదా రాష్ట్ర వైద్య రిజిస్టర్ (ఎస్ఎంఆర్) నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
కొన్ని కళాశాలల నోడల్ అధికారులు రిజిస్ట్రేషన్ నంబర్లను నమోదు చేయకపోవడంతో పాటు, మరికొన్ని చోట్ల తప్పు వివరాలను నమోదు చేసినట్లు ఎన్ఎంసీ గుర్తించింది. పెండింగ్లో ఉన్న వివరాలను వెంటనే పరిశీలించి సరైన ఎన్ఎంఆర్/ఎస్ఎంఆర్ నంబర్లను నమోదు చేయాలని సూచించింది.
వివరాలు అప్డేట్ చేయకపోతే కీలక పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎన్ఎంసీ హెచ్చరించింది. తప్పు నంబర్లు నమోదు చేసినా లేదా వివరాలను అప్డేట్ చేయకపోయినా ఏఈబీఏఎస్లో రోజువారీ హాజరు ఆటోమేటిక్గా నిలిపివేయబడటంతో పాటు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఎన్ఎంసీ తనిఖీలు, కళాశాలల నిబంధనల అనుసరణపై కూడా ప్రభావం చూపవచ్చని తెలిపింది.
వైద్య కళాశాలల డీన్లు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, అదనంగా ఇచ్చిన మూడు వారాల గడువులోపు అన్ని వివరాలు సక్రమంగా అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది.












