ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష కూటమి నాయకులు దాఖలు చేసిన పిటిషన్లో 14 సాంకేతిక, పత్రాల సంబంధిత లోపాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించింది. కోర్టు ఫీజు రూ.220 తక్కువగా చెల్లించడం, అవసరమైన న్యాయపరమైన అధికార పత్రాలు లేకపోవడం వంటి అభ్యంతరాలున్నాయి.
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించిన లోపాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తింపు కార్డు ప్రతిలో స్పష్టత లేకపోవడం, కొన్ని పేజీలు చదవడానికి వీలుగా లేకపోవడం, పత్రాల్లో పేజీల సంఖ్యలో తప్పులు, కొన్ని పేజీలు లేకపోవడం వంటివి ఉన్నాయి. కొన్ని పత్రాలకు అవసరమైన రంగుల ప్రతులు సమర్పించకపోవడం, ప్రాంతీయ భాషలో ఉన్న పేజీలకు అనువాదం జత చేయకపోవడం వంటి అంశాలనూ రిజిస్ట్రీ ప్రస్తావించింది.
విపక్షాల ప్రధాన డిమాండ్లు
ఓటర్ల జాబితాలో తొలగించిన పేర్లపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని, ఎన్నికల సంఘం వద్ద ఉన్న సవరణకు సంబంధించిన పత్రాలు, రికార్డులను సమర్పించేలా ఆదేశించాలని, ఓటర్ల పేర్లను తొలగించే ముందు నోటీసు, తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పించేలా రక్షణ చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరాయి. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై న్యాయపరమైన సమీక్ష జరపాలని, విచారణ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాయి.
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం వైఖరి, సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత రాయ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) నేత సుప్రియా సూలే, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నేత సంజయ్ రౌత్, డి. రాజా, మహువా మాఝీ, ఎం.ఎ. బేబీ, ఇ.టి. మహమ్మద్ బషీర్ తదితరులు ఈ పిటిషన్లో భాగస్వాములుగా ఉన్నారు.
విచారణ ఎప్పుడు
పిటిషన్లోని లోపాలను సరిచేసిన తర్వాతే విచారణకు జాబితా చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. న విచారణకు సంబంధించిన అనుబంధ జాబితాలో ఈ పిటిషన్ చోటు చేసుకోలేదు. లోపాల సవరణ కోసం పిటిషనర్ల న్యాయవాదులు సమయం కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని రిజిస్ట్రీ గుర్తించడం అనేది కేసులోని ఆరోపణలపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినట్లు కాదు. లోపాలను సరిచేసి, పిటిషన్ విచారణకు స్వీకరించబడిన తర్వాతే దానిలోని అంశాలపై న్యాయస్థానం పరిశీలన కొనసాగుతుంది.










