పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థలకు భారత రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 18 మంది అనుమానితులు దర్యాప్తు పరిధిలో ఉండగా, వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఫైర్‌వాల్2026 పేరుతో దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్టైన వారిలో విశాఖపట్నంలో నేవీ అధికారులకు కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్, విశాఖ నేవల్ బేస్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ ఉన్నారు. రక్షణ సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలు, నౌకాదళానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థలతో పంచుకున్నారన్న ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.
ఈ కేసును ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నమోదు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉండటంతో, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా ఆపరేషన్ ఫైర్‌వాల్2026 చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ తదితర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. రాష్ట్ర పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ బృందాలు, నేవీ అధికారులు, స్థానిక పోలీసుల సమన్వయంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పలువురు అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు.
విచారణలో సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి నేవీ సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పరిచయం ఏర్పరచుకుని, అనంతరం వాట్సాప్ ద్వారా సంభాషణలు కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు. కొందరిని తేనెటీగ గూడు (హనీపాట్) పద్ధతిలో ఆకర్షించి, నౌకలు, జలాంతర్గాములు, వాటి కదలికలు, అధికారుల వివరాలు, రక్షణ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.
భారత మొబైల్ నంబర్లు, వాట్సాప్ యాక్టివేషన్ ఓటీపీలు, క్రిప్టోకరెన్సీ మార్గాల్లో చెల్లింపులు జరిగిన అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు ఓటీపీలను అందించడానికి కొందరికి డబ్బు ఆఫర్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ డిజిటల్, ఆర్థిక లావాదేవీల ఆధారంగా నెట్‌వర్క్‌లో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్టైన సాయి వరప్రసాద్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనను విశాఖపట్నం జిల్లా జైలుకు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్ ముఖర్జీని తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకు తీసుకువచ్చిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కూడా రిమాండ్ విధించారు.
మిగిలిన 16 మంది అనుమానితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సమాచారం పంచుకున్నారు, ఆ సమాచారానికి ప్రతిఫలంగా నగదు లేదా ఇతర ప్రయోజనాలు పొందారా అనే అంశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.











