యెమ్మిగనూరు, 16 October
ఎమ్మిగనూరు. పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభం.
ఎమ్మిగనూరు పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు నామినేషన్ల ఘట్టంలో మొత్తం 3 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థులు తమ పత్రాలను అధికారులకు అందజేశారు. ఇందులో చైర్పర్సన్ పదవికి ఒకరు, వార్డు సభ్యుల (కౌన్సిలర్) పదవులకు ఇద్దరు నామినేషన్లు సమర్పించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు కావడంతో అధికారులు, ప్రధాన పార్టీల నాయకులు నామినేషన్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీవో అరుణాదేవి ఈ నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఎస్పీ సమీక్షించగా, సిబ్బందికి ఆర్డీవో పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వారు స్పష్టం చేశారు.











