భారతదేశంలో సెప్టెంబర్ నెలలో నిత్యావసర ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉల్లి, చక్కెర, వంట నూనెలు, బియ్యం వంటి నిత్యావసరాల ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ ధరల పెరుగుదల ప్రభావం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
అక్టోబర్ నెలకు సంబంధించిన మంత్లీ ఎకనామిక్ రివ్యూ నివేదిక ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ () ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరుకుంది. గత నెలతో పోలిస్తే ఇది 0.71 శాతం పాయింట్లు పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 7.74 శాతానికి పెరిగింది. దీంతో సామాన్య ప్రజల కుటుంబ బడ్జెట్‌పై భారం పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ధరల ప్రభావం
ఈ ధరల పెరుగుదల అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. సెప్టెంబర్ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.08 శాతంగా నమోదవగా, పట్టణ ప్రాంతాల్లో 4.88 శాతంగా ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 8.06 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో 7.18 శాతంగా నమోదైంది. గ్రామీణ కుటుంబాల వినియోగంలో ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ధరల పెరుగుదల ప్రభావం వారిపై అధికంగా పడుతోంది.
ఉల్లి ధరలు రెట్టింపునకు పైగా పెరుగుదల
ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఉల్లి ధరల పెరుగుదల ఒకటిగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు ఏకంగా 108 శాతం పెరిగాయి. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి.
ప్రధాన నిత్యావసరాల ధరల పెరుగుదల శాతం: - ఉల్లి ధరలు 108 శాతం పెరుగుదల - చక్కెర ధరలు 30 శాతం పెరుగుదల - బెల్లం ధరలు 23 శాతం పెరుగుదల - రిఫైన్డ్ వంట నూనె 15 శాతం పెరుగుదల - వేరుశెనగ నూనె 14 శాతం పెరుగుదల - బియ్యం ధరలు 8 శాతం పెరుగుదల
నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణాలు
సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి. ఉల్లి ధరలు పెరగడానికి కారణం, గత రబీ సీజన్లో పండించిన ఉల్లి నిల్వలు క్రమంగా తగ్గిపోవడం. అదే సమయంలో కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లకు చేరుకోవడంలో దాదాపు ఒక నెల ఆలస్యం ఏర్పడింది. దీంతో మార్కెట్లో ఉల్లి సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.
చక్కెర ధరలు పెరగడానికి కారణాలు: చెరకు ఉత్పత్తి తగ్గడం, అధిక వర్షపాతం, రెడ్ రాట్ వ్యాధి కారణంగా పంట దెబ్బతినడం వంటి అంశాలు చక్కెర ధరలపై ప్రభావం చూపాయి. పండుగల సీజన్‌కు ముందు డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమై ఉండవచ్చు.
బియ్యం ధరలు పెరగడానికి కారణాలు: ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి భారతీయ బియ్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా బియ్యం ధరలపై ఒత్తిడి ఏర్పడింది. ఇది ధరల పెరుగుదలకు దోహదపడింది.
రిటైల్ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు పెరగడమే కాకుండా టోకు ధరల్లో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. టోకు ధరల సూచీ () ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.92 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో 11.39 శాతానికి పెరిగింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 25.85 శాతంగా, తయారీ ఉత్పత్తుల విభాగంలో 9.76 శాతంగా నమోదైంది.










